Asianet News TeluguAsianet News Telugu

బంగారు తెలంగాణ : సామాన్యుడు రోడ్డు మీద నడిచినా పన్నులేస్తారా?

కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శించారు. 

VijayaShanthi fires on KCR Family about hike prices
Author
Hyderabad, First Published Dec 21, 2019, 3:16 PM IST

బంగారు తెలంగాణ అంటూ ప్రజల నడ్డివిరుస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో గారడి చేసి ఇప్పుడు అసలు రంగు చూపిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె పేరుతో బస్సు ఛార్జీలను పెంచారు. తాజాగా పాల ధరలు పెంచారు. ఇక కరెంటు ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా ప్రతీదాన్నీ పెంచుకుంటూ పోవడమే పనిగా పెట్టుకున్నారని ఫేస్‌బుక్‌లో విజయశాంతి ప్రకటన విడుదల చేశారు.

కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారు. ఓవైపు దుబారా ఖర్చులు చేస్తూ... మరోవైపు ఇష్టానుసారంగా అప్పులు చేస్తే, ఆ భారం సామాన్యుడి మీద పడుతుందని ప్రతిపక్షాలు పలుసార్లు హెచ్చరించినపుడు, వారిపై కేసులు పెడతానని కేసీఆర్ గారు బెదిరించారని గుర్తు చేశారు. 

గతంలో టిఆర్ఎస్ పాలకులు చేసిన పాపం ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని వాపోయారు. రాబోయే రోజుల్లో సామాన్యులు రోడ్డు మీదకు వచ్చి నడిచినా డబ్బులు వసూలు చేస్తే తప్ప, ప్రభుత్వాన్ని నడపలేమని చేతులెత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని,  దీన్నే కేసీఆర్ గారి పరిభాషలో బంగారు తెలంగాణ అంటారేమో?’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios