వరంగల్:టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా కమలాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాములమ్మ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగుతున్నాయంటే అందుకు కారణం కేసీఆర్ దొరేనని అన్నారు. 

కేసీఆర్ ని తెలగాణ గాంధీ అంటున్నారని అలా అనడం సిగ్గు చేటన్నారు. ఉద్యమాలు చేసిన ప్రతీ ఒక్కరూ గాంధీ అయిపోతారా అంటూ నిలదీశారు. మహాత్మగాంధీ ది సింప్లిసిటీ అయితే కేసీఆర్ ది పబ్లిసిటీ అంటూ ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబానికి పదవులు అవసరం లేదని కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం పదవులు కావాలని తిట్టిపోశారు. 

ప్రజా ఆశీర్వాద సభలు పెట్టి సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తెలంగాణకు కాపలా కుక్కను అవుతానన్న కేసీఆర్ తెలంగాణకు కాదు, అవినీతి సొమ్ముకు కాపలా కుక్క అంటూ ధ్వజమెత్తారు. దొరల పాలనకు చరమగీతం పాడాలని అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీకి పోటు పొడవండంటూ పిలుపునిచ్చారు.