హైదరాబాద్:: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసుకు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి గుడ్ బై చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆమె షాక్ ఇచ్చారు. విజయశాంతి పార్టీని వీడబోరని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే, ఆమె సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.

విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయమైంది. ఆ విషయాన్ని బిజెపి జాతీయ నేత డికె అరుణ ధ్రువీకరించారు. విజయశాంతి బిజెపిలో చేరుతున్నారని ఆమె అన్నారు. పలువురు నేతలు బిజెపి వైపు చూస్తున్నారని ఆమె అన్నారు. 

చాలా కాలంగా విజయశాంతి కాంగ్రెసుకు దూరంగా ఉంటున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా ఆమె వెళ్లలేదు. ప్రస్తుత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం చేయడం లేదు. కాంగ్రెసు తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెసుకు వ్యతిరేకంగా, బిజెపికి అనుకూలంగా ప్రకటన చేశారు. ఆమె రేపు మంగళవారం బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. వారి సమక్షంలో ఆమె బిజెపిలో చేరుతారు. 

గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి విజయశాంతిని కలిశారు. ఆమెను బజ్జుగించడానికి కాంగ్రెసు తెలంగాణ ఇంచార్జీ వ్వవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఠాగూర్ కాస్తా ముందు హైదరాబాద్ వచ్చి ఉంటే బాగుండేదని ఆ సమయంలో విజయశాంతి అన్నారు.