హైదరాబాద్: తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అందుకు ఫేస్ బుక్ ని ఆయుధంగా చేసుకున్నాడు. ధనవంతుల అమ్మాయిలతో ఛాట్ చేసి వారి వివరాలు సేకరించి..వాళ్ల పర్సనల్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం....డబ్బులు వసూలు చెయ్యడం మెుదలుపెట్టాడు. ఎంతో నమ్మకంతో అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆపోకిరీని మరో అమ్మాయి పోలీసులకు పట్టించి కటకటాల వెనక్కి నెట్టింది. 

యాదాద్రి జిల్లా మోత్కూర్‌ మండలం బూజిలాపురానికి చెందిన మలిపెద్ది విద్యాసాగర్‌రెడ్డి(28) హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటున్నాడు. ఫేస్ బుక్ లోని అమ్మాయిలతో పరిచయం చేసుకుని వారితో ఛాటింగ్ చేయడం మెుదలుపెడతాడు. ఎంతో నమ్మకంగా నటిస్తూ వారి వ్యక్తిగత వివరాలు ముఖ్యంగా ఆర్థిక వివరాలు సేకరిస్తాడు. డబ్బున్న అమ్మాయిలనే టార్గెట్ చేసే విద్యాసాగర్ రెడ్డి సాధారణ, మధ్యతరగతి యువతుల జోలికి మాత్రం వెళ్లడు. 

ఇలా ఫేస్ బుక్ లో అమ్మాయిలతో పరిచయం చేసుకుని వివరాలు సేకరించిన తర్వాత తన వంకర బుద్ధిని బయటపెడతాడు. వారి ఫోటోలను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తాడు. విద్యాసాగర్ రెడ్డి పన్నిన ఉచ్చులో నిజాంపేటకు చెందిన ఓ యువతి చిక్కుకుంది. నిజాంపేటకు చెందిన యువతితో ఫేస్ బుక్ లో ఛాటింగ్ చేసిన విద్యాసాగర్ రెడడ్డి ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి తండ్రికి ఫోన్ చేశాడు. 


మార్పింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. తనకు 50 లక్షల రూపాయలిస్తే పెట్టనని చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి, ముంబాయిలో ఉంటున్న ఆమె వద్దకు వెళ్తానని అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.   

విద్యాసాగర్ రెడ్డి బెదిరింపులతో ఆందోళన చెందిన యువతి తండ్రి కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం నిందితుడు విద్యాసాగర్ ను కేపీహెచ్ బీ పోలీసులు ఎంతో చాకచక్యంగా వలవేసి పట్టుకున్నారు. విద్యాసాగర్ ఫేస్ బుక్ లో మరో యువతితో ఛాటింగ్ చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఆమెను సుజనా ఫోరం మాల్ లో కలిసేలా ప్లాన్ చేశారు. అమ్మాయి సుజనా ఫోరం మాల్ కు రావాలని కోరడంతో వచ్చిన విద్యాసాగర్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. 

విద్యాసాగర్‌ రెడ్డిని విచారించిన పోలీసులు అతని బాధితులు ఎంతమంది ఉన్నారన్న అంశంపై ఆరా తీశారు. అయితే ఇప్పటి వరకు విద్యాసాగర్ ధనవంతుల కుటుంబాలకు చెందిన ఐదుగురితో ఫేస్ బుక్ లో ఛాటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. తన టార్గెట్ ధనవంతులైన యువతులేనని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు విద్యాసాగర్ ఛాటింగ్ చేస్తున్న ఐదుగురు యువతులలో వివాహితులు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.