హైదరాబాద్: ఓట్ల గల్లంతుపై సీఈసి రజత్ కుమార్ క్షమాపణ చెప్పడంపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఓట్లు గల్లంతుపై రజత్ కుమార్ క్షమాపణ చెప్తే సరిపోతుందా, హత్య చేసి క్షమాపణ చెప్తే అయిపోతుందా అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ప్రశ్నించారు. 

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే ఎన్ఐఎ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు చేయించరని విహెచ్ అడిగారు. ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పుడే ప్రణాళిక అర్థమైందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేసీఆర్ వంటి నాయకుడు లేడు కాబట్టి ట్యాంపరింగ్ జరగలేదని ఆయన అన్నారు. 

ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఆరోపించారు. గురువారం ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌తో టీఆర్‌ఎస్‌ కుమ్మక్కైందని విమర్శించారు. ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఈసీ పట్టించుకోలేదని, ఎన్నికలు ముగిసిన తర్వాత రజత్ కుమార్ క్షపణలు చెప్పారని ఆమె అన్నారు. 

ఎన్నికల్లో కూడా పోలింగ్‌కు కౌంటింగ్‌కు మధ్య ఓట్ల తేడా వచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని ఆమె అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 

రజత్ కుమార్ మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. జరిగిన అవకతవకలను రజత్ కుమార్ ఇప్పుడు సరిచేస్తారా అని ఆయన అడిగారు.