హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖారరైనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా తేడా వస్తే తప్ప పిసిసి అధ్యక్షుడి పదవి రేవంత్ రెడ్డికి దక్కే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు వ్యాఖ్యలను బట్టి రేవంత్ రెడ్డి పేరు పిసిసి అధ్యక్ష పదవికి ఖరారైనట్లు అర్థమవుతోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై దూకుడుగా వ్యవహరించడం, యువతలో క్రేజ్ ఉండడం కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై విహెచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు భావించవచ్చునని అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉందో తనకు కూడా అంతే క్రేజ్ ఉందని, పీసీసీ పదవిని రెడ్డికి ఇవ్వాలనుకుంటే ఒరిజినల్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అన్నారు. 

అంతే కాకుండా బిజెపి దూకుడు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని విహెచ్ అంటున్నారు. రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఖరారు కావడం వల్లనే విహెచ్ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

కాగా, పిసిసి పదవిని ఆశిస్తూ వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంతృప్తి పరచే చర్యలకు కూడా కాంగ్రెసు అధిష్టానం సిద్ధమైంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసి)లో ఆయనకు స్థానం కల్పించే అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న ఉత్తమ కుమార్ రెడ్డికి ఎఐసీసీలో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఎస్సీ కోటాలో సంపత్ కుమార్ కు, బీసీ కోటాలో మధు యాష్కీ గౌడ్ కు, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీకి కార్యనిర్వహక అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉంది. 

2018 ఎెన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్కకు తిరిగి ఆ పదవి అప్పగించే అవకాశాలున్నాయి. ఆ పదవిలో ఉన్న విజయశాంతి బిజెపిలో చేరడంతో మల్లు భట్టి విక్రమార్కకు లైన్ క్లియర్ అయినట్లు భావిస్తున్నారు. అదే జరిగితే పిసిసీ అధ్యక్ష పదవికి పోటీ పడిన శ్రీధర్ బాబును సీఎల్పీ పక్ష నేతగా నియమించే అవకాశాలున్నాయి. 

కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే విషయాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. కోమటిరెడ్డి అందుకు అంగీకరిస్తే మల్లు భట్టి విక్రమార్కు సీఎల్పీ నేతగా కొనసాగించి, శ్రీధర్ బాబును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. 

ఇదే సమయంలో టీపీసీసీకి సలహా కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన కూడా అధిష్టానం మదిలో ఉంది. సలహా కమిటీలో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, విహెచ్ లను నియమించే అవకాశాలున్నాయి. టీపీసీసీ కూర్పుపై రాహుల్ గాందీతో ఎఐసీసీ నేత కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ చర్చిస్తారని అంటున్నారు. రాహుల్ ఏమైనా మార్పు సూచిస్తే అందుకు అనుగుణంగా తుది కూర్పు ఉండవచ్చు. 

రాహుల్ గాంధీతో చర్చల తర్వాత శనివారం గానీ సోమ, మంగళవారాల్లో గానీ తెలంగాణ పీసీసీని సోనియా గాంధీ ఆమోదంతో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉదంది. రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురు కాకుండా అత్యంత జాగ్రత్తగా అధిష్టానం టీపీసీసీ కూర్పును చేపట్టినట్లు చెబుతున్నారు.