హైదరాబాద్: పీసీసీ అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు. గత కొంతకాలంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ పదవి ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలంటూ నిలదీశారు. 

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకత్వంలో ముగ్గురు రెడ్లు ఉండి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. 

అలా ఒత్తిడి చేసిన వాళ్లు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. మెుదటి నుంచి పార్టీకి లాయల్ గా ఉన్నవాళ్లకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి పీసీసీ బీసీలకే ఇవ్వాలని కోరారు. 

జూలై మెుదటి వారంలో పార్టీకి చెందిన లాయలిస్టులంతా కలిసి సమావేశం కానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి లాయలిస్టో కాదో తనకు తెలియదన్నారు వీహెచ్. పార్టీలో తనకంటే లాయలిస్ట్ ఇంకెవరు ఉంటారని నిలదీశారని తెలిపారు. 

పారాచూట్ లకు టికెట్లు ఇవ్వొద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ కొంతమంది కావాలనే పారాచూట్ లకే టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. అందువల్లే పార్టీ ఓటమికి పాలయ్యిందన్నారు. పార్టీలో సీనియర్ గా, లాయలిస్ట్ గా తాను ఉన్నానని తెలిపారు. పార్టీ జెండామోసిన సీనియర్ నేతను తానేనని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే ఇబ్బందేమీ లేదని ఒకవేళ పీసీసీని మారిస్తే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా ఉత్తమ్ ను మార్చే అవకాశం లేదని చెప్తున్నప్పుడు జగ్గారెడ్డి తనకే పీసీసీ చీఫ్ ఇవ్వాలని ఎలా అడుగుతారంటూ నిలదీశారు వి.హన్మంతరావు.