యువతిని  ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు అనే కారణంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో... యువతికి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి జరిగినా ప్రియురాలిని మర్చిపోలేకపోయాడు. దీంతో... ఆమెను రహస్యంగా కలుస్తూ.. తన ఎఫైర్ ని కంటిన్యూ చేశాడు. అది నచ్చని ఆమె అన్నలు.. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన వేములవాడలో చోటుచేసుకుంది. 

 వేములవాడలోని సుబ్రమణ్యనగర్‌కు చెందిన నాగుల రవి(30) బార్బర్ గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం వేరే కులానికి చెందిన యువతితని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం తెలిసి యువతికి కుటుంబసభ్యులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. ఆమె భర్త దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు.దీంతో యువతి పెళ్లి అయినా కూడా పుట్టింటిలోనే ఉండేది. 

ఈ క్రమంలో ప్రియుడు రవితో యాదావిథిగా తన ప్రేమను కొనసాగించింది. భర్త అడ్డు లేకపోవడంతో ఆ మహిళ రవితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రవికి ఇంకా పెళ్లి కాకపోవడంతో వారి బంధానికి అడ్డు చెప్పేవారే లేకపోయారు. 

ఈ వ్యవహారం ఆ మహిళ తరఫు వారికి తెలియడంతో రవిని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం పనికి వెళ్లిన రవి మధ్యాహ్న సమయంలో భోజనం చేసేందుకు ఇంటికి వస్తుండగా ముగ్గురు యువకులు అతడిపై వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికారు. రవి కేకలు విన్న ఆమె తల్లి బయటకు వచ్చి తన కొడుకును చంపొద్దని వేడుకున్నా వారు కనికరించలేదు.

 తీవ్ర రక్తస్రావమైన రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రవిని నరుకుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసుల వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని గుర్తించామని.. మిగితావారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.