టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావుపై గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర స్థాయిలో వీరుచుకుపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ రాష్ట్రంలో ఉండాలంటే అందరికి భయంగా ఉందని.. ఎక్కడ చూసినా ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యం నిలబడాలనే ఉద్దేశ్యంతో ప్రజల పక్షాన తాను నిరాహార దీక్షలో కూర్చొన్నానన్నారు. దీనిని తట్టుకోలేకపోయిన కేసీఆర్ పోలీసులతో తన దీక్షను భగ్నం చేయించారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తన వద్ద ఆంధ్రావారి డబ్బులు ఉన్నాయని హరీశ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని నోరు అదుపులో వుంచుకోవాలని హెచ్చరించారు.

2001లో రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీశ్ రావుకి ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అవన్నీ సక్రంగా సంపాదించినవేనా.. లేదంటే ఆయనకు ఎవరిచ్చారని వంటేరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్ధిపేటలో ఎన్నికల కోసం రూ.50 కోట్లు కుమ్మరించారని ఆ సొమ్ము ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నాలుగున్నరేళ్లు రాష్ట్రానికి ఏం చేశారని ఓటు వేయాలో చెప్పాలని వంటేరు చెప్పారు.

ఒక్క డీఎస్సీ లేకుండా, స్కూళ్లు, కాలేజీలు మూసేసి, ప్రాజెక్టు‌లు కట్టకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. తాను గెలిచిన తర్వాత మామ, అల్లుళ్ల బండారం బయటపెడతానని.. హరీశ్‌ రావుకి రబ్బరు చెప్పులు మళ్లీ వస్తాయని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స