సిద్దిపేట: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై పోటీ చేస్తున్న గజ్వేల్‌ ప్రజాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బు పంచుతున్నారంటూ గజ్వేల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ఒంటేరు ప్రతాప్‌రెడ్డి దీక్షకు దిగారు. పోలీసులు ఈ దీక్ష భగ్నం చేసే సమయంలో ఒంటేరు సొమ్మసిల్లి పడిపోయారు. 

దాంతో ఆయనను సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒంటేరుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ప్రజాకూటమి నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకుంటున్నారు.టీఆర్ఎస్ నేతలే పోలీసులతో కుమ్మక్కై తమ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ప్రజాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు. 

అంతకు ముందు, గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. పోలీస్, ఎన్నికల అధికారుల తీరుపై వంటేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల అండతో అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు తనను వెంటాడుతున్నట్లు తెలిపారు. 
 
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కేసీఆర్‌ చేతిలో 19,029 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డి 33,998 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు.