హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పనామా గోడౌన్స్‌ వద్ద మంగళవారం రూ.58.97 లక్షలు ఎత్తుకుపోయిన దొంగలు రామ్ జీనగర్ కు చెందిన ముఠాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం సెంటర్  మిషన్లలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం సెక్యూరిటీ గార్డును దృష్టి మళ్లించి చాకచక్యంగా డబ్బు కొట్టేశారు దుండగులు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బట్టబయలయ్యాయి. దొంగతనానికి ముందు దుండగులు సమీపంలోని ఓ ఇరానీ హోటల్ లో టీ తాగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల పోలీసులు సేకరించారు. 

గతంలో దొంగతనాలకు పాల్పడిన పాత నిందిల ఫోటోలతో పోల్చి చూశారు పోలీసులు. అనంతరం దొంగతనం రామ్ జీ నగర్ కు చెందిన దీపక్ గ్యాంగ్ పనిగా నిర్ధారించారు. నిందితుల ఫోటోలను పోలీసులు బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు సెక్యూరిటీ గార్డుతో సహా వాహనం వచ్చింది. ఏటీఎంలో నగదు నింపేందుకు కస్టోడియన్లు లోపలికి వెళ్లారు. వాహనం దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. వాహనం దగ్గర నుంచి ఏటీఎం సెంటర్ వరకు నగదు చల్లి సెక్యూరిటీ గార్డును డైవర్ట్ చేశారు. 

అనంతరం మరో వ్యక్తి నగదు బాక్స్ ను కొట్టేసినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చేందుకు దొంగలు చల్లిన మెుత్తం సొమ్ము రూ.1,650 అని తెలిపారు. వీటితోపాటు మలేషియాకు చెందిన కరెన్సీ కూడా చల్లారు. 

దీంతో నిందితులు గతంలో దొంగతనాలు చేసి మలేషియాలో జల్సాలు చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనంలో 7 నుంచి 8 మంది వరకు పాల్గొని ఉండవచ్చంటున్నారు. 

వారం రోజులపాటు రెక్కీ నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న లాడ్జీలు, హోటళ్ల వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు ఉండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనాలు వాడకుండా ఆటోలను ఉపయోగించుకున్నారని తేలింది. 

దొంగతనానికి ముందు, దొంగతనం తర్వాత కూడా దొంగలు ఆటోలలోనే ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన అనంతరం వీరు రోడ్ క్రాస్ చేసి ఒక ఆటో ఎక్కారని తెలిపారు. ఎల్బీనగర్‌ లో ఆటో దిగి డ్రైవర్‌కు రూ.100 ఇచ్చి రూ.50 తిరిగి తీసుకున్నారు. 

అక్కడ నుంచి మరో ఆటో ఎక్కి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు, అక్కడ నుంచి వేరే ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మలక్ పేటలోని ఓ సులభ్ కాంప్లెక్స్ లోకి క్యాష్ బాక్స్ తో వెళ్లిన వారు ఆ డబ్బును సంచుల్లోకి మార్చుకుని సూట్ కేసును పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 

సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరంతా రాంజీనగర్ కు చెందిన దీపక్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. దొంగతనానికి పాల్పడిన దీపక్ గ్యాంగ్ ఇంకా రాంజీనగర్ చేరలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యలో 8 బృందాలుగా విడిపోయిన పోలీసులు హైదరాబాద్, చెన్నైతోపాటు ఐదు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వనస్థలిపురం పోలీసులు నేరం జరిగిన తీరును అధ్యయనం చేస్తూ కేసు రీకనస్ట్రక్షన్ చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.