Asianet News TeluguAsianet News Telugu

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య: ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్.. అర్థరాత్రి అదుపులోకి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన  వనమా రాఘవేంద్రరావు (59)  అలియాస్ రాఘవను పోలీసులు శుక్రవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.  

Vanama Raghava arrested in Bhadradri district boundary
Author
Hyderabad, First Published Jan 8, 2022, 7:53 AM IST

ఖమ్మం :  సంచలనం రేపిన Palvancha Ramakrishna suicide caseలో కొత్తగూడెం కాలకేయుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన  Vanama Raghavendra rao (59)  అలియాస్ రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.  

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు అయిన రాఘవ బెదిరింపుల కారణంగా రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకునే క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తగా,  వనమా రాఘవ అందులో తలదూర్చడమే కాకుండా.. తన భార్యను హైదరాబాద్ తీసుకు వచ్చి అప్పగిస్తే ఆస్తి దక్కేలా చూస్తానని బేరం పెట్టాడని... ఈ అవమానం భరించలేక కుటుంబసమేతంగా చనిపోతున్నానని బాధితుడు పేర్కొన్న సెల్ఫీ వీడియో గురువారం వెలుగులోకి రావడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.  తీవ్ర ఆరోపణలు రావడంతో అధికార  టిఆర్ఎస్ వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

సిమ్ కార్డులు మార్చుతూ…
రాఘవ నాటకీయ పరిణామాల నడుమ పోలీసులకు చిక్కాడు.  కొద్ది రోజులుగా తొర్రూరు, హైదరాబాద్, సూర్యాపేట, చీరాల, విశాఖపట్నం, రాజమండ్రి ప్రయాణాలు సాగించినట్లు తెలిసింది. ఒక్కో చోట ఒక్కో సిమ్ కార్డును మార్చుతూ పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తపడ్డాడు. విశాఖలో రెండు రోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా పశ్చిమగోదావరి.. భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద భద్రాద్రి జిల్లా అదనపు ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అతడిని అదుపులోకి తీసుకొని పాల్వంచ ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

అతడితో పాటు పాల్వంచ మండలానికి చెందిన ముక్తేవి గిరీష్, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వారిని పాల్వంచ తీసుకువచ్చారు. అతడిని విచారిస్తున్నామని ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాఘవ గాలింపు కోసం వాహనాల డీజిల్ ఖర్చు, భోజనాలు కలుపుకుని రోజుకు సుమారు లక్ష ఖర్చు చేసినట్లు పోలీసులు అధికారుల్లో ఒకరు చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు అతడు పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

బాధితుడు రామకృష్ణ వీడియో మరొకటి శుక్రవారం బయటకు వచ్చింది. అందులో రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంత క్షోభ అనుభవించానో అంటూ పలు వివరాలు తెలియజేశారు. మరోవైపు రాఘవ అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అతడిపై గతంలో నమోదైన  పలు కేసులను పోలీసులు ఇప్పుడు బైటికి తీసుకువస్తున్నారు. 2020లో తన ఆత్మహత్యకు కారణం రాఘవ అని రాసి బలవన్మరణానికి పాల్పడిన పాల్వంచ వాసి మల్లిపెద్ది వెంకటేశ్వర రావు కేసులో గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గేటుకు అంటించారు. తమ ఎదుట హాజరు ఇవ్వకుంటే బెయిల్ రద్దు చేస్తామని మణుగూరు ఎస్పీ శబరీష్ హెచ్చరించారు.  రామకృష్ణ సహా అనేక మంది బాధితులకు రాఘవ వల్ల తీవ్ర నష్టం జరిగిన ఇన్నాళ్లకు విచారణకు సిద్ధపడుతున్నారు.

తొలుత ఆస్తిపై… తర్వాత ఆమెపై  కన్ను…. 
నాగ రామకృష్ణ కుటుంబం ఆస్తి వివాదంపై అతని తల్లి సూర్యావతి పరిచయస్థుడైన రాఘవను సంప్రదించింది. ఆ సమయంలో హైదరాబాద్ హయత్ నగర్ లో వారికున్న స్థలం గురించి రాఘవ తెలుసుకున్నాడు. రామకృష్ణ అతడికి భయపడి దాని విలువరూ. 60 లక్షలు అని పేర్కొన్నాడు. కానీ రాఘవ తన అనుచరులతో ఆరా తీసి రూ. 2.50 కోట్లు అని తేలడంతో ఆ స్థలంపై కన్నేసాడు. ఇది గుర్తించిన రామకృష్ణ మరింత ప్రాధేయ పడ్డాడు. దీంతో రాఘవ తన నిజస్వరూపం బయట పెట్టాడు.  అతని భార్యనే పణంగా పెట్టాలని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన రామకృష్ణ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

సినీఫక్కీలో కార్మిక నాయకుడు మాయం…
పాత పాల్వంచ కు చెందిన చెర్ల చిట్టెయ్య పట్టణంలోని స్పాంజ్ ఐరన్ (ప్రస్తుతం ఎన్ఎండిసి) ఉద్యోగి.  మూడు దశాబ్దాల క్రితం తేదేపా క్రియాశీల కార్యకర్త.  1993లో పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘ ఎన్నికలలో ఆయన టిఎన్టియుసిని బలపరిచాడు. ఐఎన్ టీయూసీకి మద్దతివ్వాలని రాఘవ ఒత్తిడి తేగా..ఆయన ససేమిరా అన్నాడు. ఒక రోజు డ్యూటీకి వెళ్ళిన చిట్టయ్య ఇంటికి తిరిగి రాలేదు. కొద్దిరోజుల తర్వాత తూర్పుగోదావరి లో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు లభ్యమయ్యాయి. అవి చిట్టయ్యవేనని కుటుంబీకులుగుర్తించారు. ఈ హత్యోదంతంలో రాఘవ నిందితుడనే ఆరోపణలు వచ్చాయి. ఐదేళ్ల విచారణ అనంతరం సాక్ష్యాధారాలు లేక కోర్టు కేసు కొట్టేసింది.

తక్కెడ ఎట్లా మొగ్గితే.. అటువైపే…
పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు బొల్లిగూడెం లోని ఓ వ్యక్తి వద్ద రూ.25 లక్షలకు రెండు చిట్టీలు వేశారు.  గడువు ముగిసినా నిర్వాహకుడు రూ.50 లక్షలు ఇవ్వలేదు. చివరకు ఓ ఫ్లాట్ రాసిచ్చాడు మళ్లీ దాన్ని సత్తుపల్లి కి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా అమ్మడు. అన్నాడు ఇది తెలిసి బాధితుడు అతన్ని నిలదీశాడు. పంచాయతీ పెట్టి న్యాయం చేస్తానని అతడి దగ్గర పది లక్షలు తీసుకున్నాడు. అంతలో అవతలి వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇస్తాను అనడంతో రాఘవ ఆ వైపు మొగ్గు చూపాడు. 

వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించినా కనీసం ఫిర్యాదు తీసుకోలేదు.స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు పైపెచ్చు అతడి పైనే తప్పుడు కేసులు బనాయించి 14 రోజులు రిమాండ్ పంపడంతో బెయిల్ పై వచ్చిన బాధితుడు రాఘవ  సహా  42 మంది   కారకులంటూ  పేర్లుపేరు రాసి పెట్టి గతేడాది  ఆత్మహత్య చేసుకున్నాడు.  కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ విచారించ లేదని బాధితులు శ్రావణి ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios