Asianet News TeluguAsianet News Telugu

అంబర్‌పేట నాదే .. నా జోలికొస్తే నీ బండారం బయటపెడతా : ఉత్తమ్‌కు వీహెచ్ వార్నింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత వీ .హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు . మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. అంబర్‌పేట సీటు తనదని, తనకు దక్కకుండా చేస్తే ఉత్తమ్ వెంట పడతానని ఆయన హెచ్చరించారు. 

v hanumantha rao sensational comments on congress mp uttam kumar reddy ksp
Author
First Published Oct 22, 2023, 6:26 PM IST

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని సీనియర్లు, ముఖ్యంగా బీసీ నేతలు అలకబూనినట్లుగా కనిపిస్తోంది. బీసీలకు ఎక్కువ సీట్లు కావాలంటూ ఇప్పటికే వారు ఢిల్లీలో అగ్రనేతలను కలిశారు. ఈ క్రమంలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయంటూ వాపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో 40 ఏళ్ల అనుబంధాన్ని ఆయన తెంచుకుని బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత వీ .హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. తనను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందని వీహెచ్ ఆరోపించారు. నీకు, నీ భార్యకు మాత్రం సీట్లు కావాలి.. నాకొద్దా అని హనుమంతరావు ప్రశ్నించారు. అంబర్‌పేట సీటు తనదని, తనకు దక్కకుండా చేస్తే ఉత్తమ్ వెంట పడతానని ఆయన హెచ్చరించారు. గతంలో ఇక్కడి నుంచే తాను గెలిచి మంత్రిని అయ్యానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశానని వీహెచ్ గుర్తుచేశారు. అంబర్‌పేట్ టికెట్‌ను లక్ష్మణ్ యాదవ్ అడుగుతున్నారని.. గత ఎన్నికల్లో కోదండరాం గట్టిగా పట్టుబట్టడం, హైకమాండ్ జోక్యంతో తాను వెనక్కి తగ్గానని వీ హనుమంతరావు పేర్కొన్నారు. 

అంబర్‌పేట్ నుంచి నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని.. ఆయన తనపై గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడని వీహెచ్ ఆరోపించారు. తాను పార్టీనీ వీడుతున్నట్లుగా , గత ఎన్నికల్లో డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతరావు డబ్బుకు అమ్ముడుపోయే మనిషి కాదని.. అలాంటి వ్యక్తినే అయితే సగం హైదరాబాద్ నాదేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాను ఎన్నటికీ కాంగ్రెస్‌ను వీడనని.. గతంలో మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి, కౌశిక్ రెడ్డినీ బీఆర్ఎస్‌లోకి పంపింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని వీహెచ్ ఆరోపించారు. జగ్గారెడ్డికి ఆశ కల్పించి.. రేవంత్ రెడ్డిపై ప్రతిరోజూ మాట్లాడించింది ఉత్తమేనని వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా పనిచేయడం మానకుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన పనులన్నీ బయటపెడతానని హనుమంతరావు హెచ్చరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios