కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తనమీద జరుగుతున్న అసత్య ప్రచారం మీద దర్యాప్తు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తన ఫొటో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని వాపోయారు. 

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి KCRను తాను కలిసినట్లుగా చిత్రాన్ని morphing చేసి దానిపై పార్టీ మారుతున్నట్లు వ్యాఖ్యల్ని జోడించి viral చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత V Hanumanth Rao హైదరాబాద్ సైబర్ పోలీస్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సీపీ CV Anand కు ఫిర్యాదు అందజేశారు.

అనంతరం విహెచ్ మాట్లాడుతూ ‘Pulse of Telangana’ పేరిట ఉన్న వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు, జగ్గారెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ తో ఉన్నట్లుగా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని తెలిపారు.

ఆ ఫొటోలో టీఆర్‌ఎస్‌ కండువా ధరించి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడితో పాటు నిలుచున్నట్టుగా మార్ఫింగ్‌ చేసి ఉంది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన వాపోయారు. ఈ ఫొటోలో కేసీఆర్ కు ఒక వైపు హనుమంతరావు, మరోవైపు జగ్గారెడ్డి నిలుచున్నట్టుగా.. వీరిద్దరూ కలిసి పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం కొనసాగుతోంది. 

హనుమంతరావు తన ఫిర్యాదులో, ఈ సమస్య తన రాజకీయ జీవితాన్ని కలుషితం చేస్తోందని, వాట్సాప్ లో తనకు వచ్చిన ఈ ఫొటో ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారిందని అన్నారు.“ఇది తప్పుడు, రెచ్చగొట్టే విధంగా ఉంది.. అభ్యంతరకరమైంది. నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. నాపై తప్పుడు వార్తలను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నాను. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని హనుమంతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీహెచ్, సి పీ ల మధ్య సరదా సంభాషణ ..
 హైదరాబాద్ సైబర్ ఠాణాకు వచ్చిన సీపీ సీవీ ఆనంద్ కు వీహెచ్ మధ్య ఆసక్తికర, సరదా సంభాషణ ఇలా సాగింది…

వీహెచ్ : డ్రగ్స్ పై తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకం. యువత మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటుంది. నేను ఏటా నిర్వహించే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలను ఈ నెల 22న హాజరై ప్రారంభించాలి.

సీవీ ఆనంద్ : వస్తా.. ఇంతకీ ఎవరిపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు. నా పైనా.. నేను ఏమైనా చేశానా.. లేక మా వాళ్లు ఏమైనా చేశారా? 
అన్నారు సరదాగా దీంతో ఠాణాలో నవ్వులు పూశాయి.

వీహెచ్ : ఎవరో గిట్టని వారు నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. టిఆర్ఎస్లో చేరినట్లు.. కండువా వేసుకున్నట్లు.. ఫోటోలు మార్ఫింగ్ చేశారు.

సీవీ ఆనంద్ : మార్ఫింగ్ కేసా.. దీన్ని సీరియస్ గా తీసుకుంటాం. ఇంతకీ వారు రాసిన వ్యాఖ్యలో ఏమైనా నిజం ఉందా? మీ మనసులో అలాంటి ఆలోచన ఉందా?

వీహెచ్ : మా పార్టీలోనే డేంజర్ ఉంది. మా లోనే ప్రతిపక్షం ఉంది.

సీవీ ఆనంద్ : అది అందరికీ తెలిసిందే కదా.. మీకు మరో ప్రతిపక్షమే అక్కర్లేదు..
అని సీపీ అనగానే మళ్లీ అందరూ నవ్వారు. ఇలా కాసేపు సీపీ, వీహెచ్ హనుమంతరావు మాట్లాడుకున్నారు.