తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ మారింది. తాను బీజేపీలో చేరబోతున్నట్టుగా రాజగోపాల్‌ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆయనను ఎలాగైనా పార్టీలో కొనసాగించేలా చూడాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ మారింది. తాను బీజేపీలో చేరబోతున్నట్టుగా రాజగోపాల్‌ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆయనను ఎలాగైనా పార్టీలో కొనసాగించేలా చూడాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అన్ని మార్గాలుగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి చర్చించగా.. తాజాగా ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. 

శనివారం ఉదయం హైదరాబాద్‌లోని రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా చూసే బాధ్యతను ఏఐసీసీ అప్పగించడంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయనతో బేటీ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. మరోవైపు ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయి.. ఆయనతో చర్చలు జరిపారు. 

మరోవైపు రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్‌ను వీడనున్నాననే సంకేతాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాలని కోరిన కూడా ఆయన వెళ్లలేదు. టీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు వేస్తున్న అడుగుల్లో రాజీపడేది లేదని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కుటుంబం అవినీతి చేసి.. భారీగా సంపదను కూడబెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందుకు వ్యతిరేకంగా తాను పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. 

అయితే తాను బీజేపీలో చేరతానని చెప్పలేదని.. వచ్చే ఎన్నికలు పాండవులు, కౌరవుల మధ్యే జరుగుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం, ఆయన డబ్బు పంచే సైన్యం ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో చేరాలన్న తన నిర్ణయాన్ని ఆయన అనుచరులు ఆమోదించారని అంతకుముందు రాజగోపాల్ పేర్కొన్నారు.