తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు  చేస్తుందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఒకే ప్రాంతం నుంచి గెలిచానని చెప్పారు. తనకు ఉన్న అనుభవం, సమాచారం ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతుందని అన్నారు. 

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి నవంబర్‌లో ఐదు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలు మొదటి స్టెప్పుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో.. ఐదుకు ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. 2024 మేలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. 

ప్రతి తెలంగాణ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో ఉందని ఆరోపించారు. గత 9 ఏళ్లలో తెలంగాణ అప్పులు భారీగా పెరిగాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల ముఠాల మాదిరిగా జనాల మీద పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ద్వారా దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు.