తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే కొన్ని పట్టణాలు, ప్రాంతాల పేర్లను మార్చనున్నట్లు ఆ పార్టీ నాయకులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి ఆ  విషయాన్ని గుర్తుచేశారు. కరీంగనర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న యోగి బిజెపి పార్టీని గెలిపిస్తే కరీంనగర్ పేరును కరిపురంగా మారుస్తామని స్పష్టం చేశారు. 

కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ కూమార్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో యోగి ప్రసంగించారు. ఇక్కడి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.  

ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలన్ని కుటుంబ పార్టీలేనని యోగి పేర్కొన్నారు. కానీ బిజెపి ఇలాంటి కుటుంబ రాజకీయాలకు విరుద్దమని స్పష్టం చేశారు. చిన్న స్థాయి కార్యకర్తలు కూడా బిజెపిలో ఉన్నత పదవులు పొందుతారనడానికి మోదీ, వెంకయ్య నాయుడు, మురళీధర్ రావులే ఉదాహరణ అని యోగి వెల్లడించారు. 

ఉత్తర ప్రదేశ్ లో బిజెపి  అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాల పేర్లను మార్చడం జరిగింది. దీనిని ప్రతిపక్షాలతో పాటు ఇతర జాతీయ పార్టీలు వ్యతిరేకించినా యోగి సర్కార్ తన నిర్ణయం పై వెనక్కి తగ్గలేదు. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ పేరున బాగ్యనగరంగా, నిజామాబాద్ పూరును ఇందూరుగా మార్చడంతో పాటు వికారాబాద్, కరీంనగర్ పేర్లను మార్చుతామని బిజెపి నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో కరీంనగర్ సభలో ఈ విషయాన్ని యూపి సీఎం యోగి మరోసారి గుర్తుచేశారు.