దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం బీజేపీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ వాసుల ఉత్సాహం చూస్తే చాలా ఆనందంగా వుందన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం సర్దార్ పటేల్‌తో సాకారమైందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370ని తొలగించారని యూపీ సీఎం గుర్తుచేశారు. 400 ఏళ్లకు పైగా కార్యరూపం దాల్చని అయోధ్య రామమందిరాన్ని ఇప్పుడు కట్టుకుంటున్నామని యోగి తెలిపారు.

ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు ఎందుకు కట్టలేదని ఆదిత్య నాథ్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం 15 లక్షల ఇళ్లు ఇచ్చిందని ఆయన చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం వరద సాయాన్ని బాధితులకు నేరుగా ఖాతాల్లో నగదు ఎందుకు జమ చేయలేదని యోగి ఆదిత్య నాథ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే తెలంగాణ ప్రభుత్వం నగదు రూపంలో సాయాన్ని పంపిణీ చేసిందని యోగి ఆరోపించారు.

నిజాం రూపంలో వస్తున్న మరో నయా నిజాం పథకాన్ని పారనివ్వకూడదని... ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా అంటూ యోగి ప్రజలను ప్రశ్నించారు.