హైదరాబాద్‌లో దారుణం.. అక్కాతమ్ముడిపై కత్తితో దుండగుడి దాడి, తమ్ముడు మృతి
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి.. లోపల వున్న అక్కా తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు . ఈ ఘటనలో తమ్ముడు చింటూ ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి.. లోపల వున్న అక్కా తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తమ్ముడు చింటూ ప్రాణాలు కోల్పోయాడు. అక్క సంఘవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దుండగుడిని పట్టుకున్న స్థానికులు అతనిని ఓ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను పోలీసులు ప్రేమోన్మాది దాడి ఘటనగా నిర్ధారించారు. సంఘవి, రామంతాపూర్ చెందిన నిందితుడు శివకుమార్‌ల మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఈరోజు మధ్యాహ్నం ఇంటికొచ్చి సంఘవితో గొడవకు దిగాడు. ఆ సమయంలో ఆమె తమ్మడు పృథ్వీ ఇంట్లోనే వున్నారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో పృథ్వీ, సంఘవీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి గొడవను గమనించిన స్థానికులు శివకుమార్‌ను పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేయగా.. సంఘవి హోమియోపతి చదువుతోంది.