తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విరుచుకుపడ్డారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో పటాన్‌చెరులో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. తన ఇంట్లోని కుక్క చనిపోతే డాక్టర్‌పై కేసు పెట్టి జైలుకు పంపించారని.. ఆయన తన కుక్కు ఇచ్చే విలువ, మర్యాదను కూడా తెలంగాణ అమరవీరులకు ఇవ్వడం లేదని జోషి మండిపడ్డారు.

కేసీఆర్ హయాంలో హైదరాబాద్ రాష్ట్రం కోసం, తెలంగాణ విమోచనం కోసం బలిదానాలు చేసుకున్న వారికి కుటుంబాలకు ఎలాంటి గౌరవం లభించదని ఆయన ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. తొలుత రూ.35 వేల కోట్ల అంచనాలతో చేపట్టి, చివరికి దానిని రూ.80 వేల కోట్లకు పెంచారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

అవినీతికి పాల్పడిన బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లారని కేసీఆర్‌కు అదేగతి పడుతుందని జోషి హెచ్చరించారు. ఒంటెద్దు పోకడలు పోయే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెడలు వంచామని, అక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అదే తరహా పరిస్ధితులు ఏర్పడతాయని జోషి అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ కారులో మజ్లిస్ సవారీ చేస్తోందని.. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి భయపడుతున్నారని ప్రహ్లాద్ జోషి విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని అప్పుడు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.