అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరు: జమ్మికుంట సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్


కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో  నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  పాల్గొన్నారు.కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు.

 Union Minister  Rajnath Singh Calls  KCR Government Most Corrupt lns


కరీంనగర్: అధికారం లేకుండా కేసీఆర్  ఉండలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రిరాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, ఆయన పరివారమే  బాగుపడ్డారని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో  నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  పాల్గొన్నారు. 
  
వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని  రాజ్ నాథ్ సింగ్  పేర్కొన్నారు.రాణి రుద్రమ, కొమరంభీమ్ లాంటి ఎందరో పరాక్రమవంతులు ఈ గడ్డపై పుట్టారని  రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు.1984లో  దేశంలో రెండు స్థానాల్లో  బీజేపీ గెలిచిందన్నారు.  ఆ ఎన్నికల్లో  గెలిచిన సీట్లలో ఒకటి తెలంగాణ నుండే అని ఆయన గుర్తు చేసుకున్నారు. వరంగల్ నుండి  జంగారెడ్డి  ఎంపీగా  విజయం సాధించారన్నారు.

27 ఏళ్లుగా గుజరాత్ లో  బీజేపీ అధికారంలో ఉందన్నారు.అంతేకాదుఅభివృద్దికి గుజరాత్ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ది చెందలేదో  కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో  కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ది జరిగిందని ఆయన  ఆరోపించారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో  సాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ కూడా పోరాడిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

కేంద్రంలో  వాజ్ పేయ్ ప్రభుత్వం ఉన్న సమయంలో  మూడు   రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన  ప్రస్తావించారు.ఆ రాష్ట్రాల్లో అభివృద్ది కొనసాగుతుందన్నారు. కానీ, తెలంగాణలో అభివృద్ది ఎందుకు సాగడం లేదని ఆయన  ప్రశ్నించారు.

రెండు సార్లు తెలంగాణలో  కేసీఆర్ కు ప్రజలు అధికారమిచ్చారన్నారు. కానీ తెలంగాణలో అభివృద్ది ఎందుకు చేయలేదని  ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని ఆయన ఆరోపించారు.  

తమ పార్టీ ఇచ్చిన  హామీలను వాగ్ధానం చేస్తుందని  రాజ్ నాథ్ సింగ్  చెప్పారు. ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.  ఒక్క పరీక్ష కూడ సరిగా నిర్వహించలేదు, దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైందని ఆయన అడిగారు. పరీక్షలు కూడ సక్రమంగా నిర్వహించనందుకు గాను  ప్రజలకు క్షమాపణ చెప్పాలని  కేసీఆర్ ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.దళిత బంధు కేవలం  బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నవారికే అందిందని ఆయన  ఆరోపించారు.ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందన్నారు.

రామమందిర నిర్మాణం కోసం  బీజేపీ ఉద్యమించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే ఏడాది జనవరి  26న అయోధ్యలో  భవ్య రామమందిర కలను సాకారం చేయనున్నట్టుగా  రాజ్ నాథ్ సింగ్  తెలిపారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకొచ్చినట్టుగా  ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో  రెండుసార్లు  బీఆర్ఎస్ కు అవకాశమిచ్చారు... కానీ ప్రజల ఆశయాలను కేసీఆర్ నెరవేర్చలేదని  కేంద్ర మంత్రి విమర్శించారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన  తెలంగాణ ప్రజలను కోరారు. తమకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ కోట్లు ఖర్చు చేసినా కూడ  ఈటల రాజేందర్ విజయం సాధించారని  ఆయన చెప్పారు. కేసీఆర్ రంగంలోకి దిగినా కూడ ఈటల రాజేందర్ విజయాన్ని ఆపలేకపోయారన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios