హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అశ్వినీ దత్ ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కలుసుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇటీవల ప్రహ్లాద్ జోషీ హైదరాబాదు పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషీ అశ్వినీ దత్ తో భేటీ అయ్యారు. 

ప్రహ్లాద్ జోషీ భేటీలో అశ్వినీ దత్ కుతూరు ప్రయాంక దత్, అల్లుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు. నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ మహానటి సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ప్రహ్లాద్ జోషీతో పాటు అశ్వినీ దత్ ను కలిసినవారిలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతరులు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అశ్వినీ దత్ తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. కానీ ఆ పనిచేయలేదు.

అశ్వినీ దత్ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు కూడా. అశ్వినీ దత్ ప్రహ్లాద్ జోషీతో సినిమాల గురించి, సినీ పరిశ్రమపై జిఎస్టీ వంటి అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో సినిమా షూటింగులకు అంతరాయం లేకుండా చూసేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రహ్లాద్ జోషీ వివరించినట్లు తెలుస్తోంది.