కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన పర్యాటక శాఖను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తనకు కేటాయించిన మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. 

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పగ్గాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఆగస్టు 15 నుంచి భారతదేశానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని తెలిపారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నడిపించాలని పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఈ శాఖల అధికారులతో కలిసి చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ ముగిసిన తర్వాత భారతదేశాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన రంగం పర్యాటకమని.. ఈ రంగంపై ఆధారపడిన సంస్థలు, వ్యాపారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక శాఖకు సంబంధించిన లక్ష్యాలను ఇంకా చేరుకోవాల్సి వుందని.. ఎన్నో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు భారతదేశంలో వున్నాయని మంత్రి తెలిపారు.

Also Read:కేంద్ర కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్... తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేఒక్కడు , ఆయన ప్రస్థానం ఇదే

వీటిని ప్రపంచం ముందు పెట్టాల్సిన అవసరం వుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. మనదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులతో తాను త్వరలోనే చర్చలు జరుపుతానని.. 68 వేల కోట్ల విలువైన బడ్జెట్‌ను దీనికి కేటాయించారని కిషన్ రెడ్డి చెప్పారు. తనకు కేటాయించిన మూడు శాఖలకు ఎంతో ప్రాధాన్యత వుందని.. ప్రధాని మోడీ తనకు కేటాయించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.