Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తూనే ఉంది.. వరంగల్‌కు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: కిషన్ రెడ్డి

గత 8 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాలను సమాన స్థాయిలో అభివృద్ది చేస్తుందని చెప్పారు. 

Union Minister Kishan Reddy Speech At BJP Public Meeting In Hanamkonda
Author
First Published Aug 27, 2022, 6:18 PM IST

గత 8 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాలను సమాన స్థాయిలో అభివృద్ది చేస్తుందని చెప్పారు. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్.. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుందని చెప్పారు.  

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం భారీగా  నిధులు ఇచ్చిందన్నారు. రోడ్ల కోసం మొత్తం రూ. 20 వేల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేస్తుందని చెప్పారు.యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ. 388 కోట్లతో రోడ్డు నిర్మించిందని చెప్పారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌ రోడ్డుకు రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని చెప్పారు. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ. 196 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇది నిజం కాదా..? అని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు. 

వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ది చేస్తానని కేసీఆర్ అన్నారని.. కానీ కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదని, వరంగల్‌‌లో అభివృద్ది చేసింది లేదన్నారు. వరంగల్ అభివృద్దికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. 

రామప్ప ఆలయానికి కేంద్రం యూనెస్కో గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు. రామప్ప ఆలయం అభివృద్దికి రూ. 60 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వేయి స్తంభాల గుడి అభివృద్దికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ మంజూరు చేసిందన్నారు. కానీ సైనిక్ స్కూల్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం భూమి కేటాయించడం లేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమి కేటాయించడం లేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 

వరంగల్ జిల్లాలోని ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. కూలిపోయే దశలో ఉణ్న  కాకతీయుల కళామండపాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. కాకతీయుల కళామండపాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోందని చెప్పారు. అమృత్ పథకం కింద నిధులు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయాలని కోరుతున్నట్టుగా చెప్పారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios