Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం.. కావాలనే సింగరేణి కార్మికులను రెచ్చగొడుతున్నారు: కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి  లేదని  స్పష్టం చేశారు. 

union minister Kishan Reddy slams TRS And says Central Govt  has No thought of Privatization of singareni
Author
First Published Dec 10, 2022, 4:54 PM IST

సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి  లేదని  స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారని చెప్పారు. సింగరేణిలో 51 శాతం షేర్ తెలంగాణదేనని.. కేంద్రానిది 49 శాతం అని అన్నారు.సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదన్నారు. శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు గనులను కేటాయిస్తున్నారని.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వ సంస్థలకు అందించడం లేదని.. గుజరాత్‌కో న్యాయం, తెలంగాణాకో న్యాయం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులను కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని చెప్పిన కల్వకుంట్ల కుటుంబం.. తెలంగాణలో బీజేపీ బలపడం, ప్రజలు ఆదరించడం చూసి భయపడిపోయి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ అయినా, తెలంగాణ అయినా.. మరే ఇతర రాష్ట్రమైనా కూడా సమానంగా చూడాలని, అన్ని రాష్ట్రాలతో సమన్వయంతో పరిపాలన సాగాలని  కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు.

బొగ్గు గనుల వేలంపై కల్వకుంట్ల కుటుంబం అసత్యాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 2020లో కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అప్పటివరకు బొగ్గు కొరత, విద్యుత్ ఉత్పత్తుల్లో తీవ్రమైన అవరోధం ఉండేది, విద్యుత్ కోతలు ఉండేవని.. వీటిని అధిగమించేందుకు ప్రధాని మోదీ అనేక ఏళ్లుగా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఏ బొగ్గు గని అయినా సరే బహిరంగ వేలంలోనే కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం  జరిగిందన్నారు. 

యూపీఏ హయాంలో భారీ  కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. తర్వాత సుప్రీం కోర్టు యూపీఏ హయాంలో ఇచ్చినటువంటి అన్ని బొగ్గు ఒప్పందాలను  రద్దు చేస్తూ బహిరంగంగా అందరికి అందుబాటులో ఉండేలా  చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. యూపీఏ హయాంలో జరిగిన అవినితీని ప్రక్షాళన చేసి.. ప్రధాని మోదీ అనేక మార్పులు  తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు జవాబుదారీతనంతో ఉండాలని.. డిజిటల్ సిస్టమ్ ద్వారా మధ్యదళారీ వ్యవస్థ లేకుండా చేయడం జరిగిందన్నారు. గత 8 ఏళ్లుగా ఒక అవినీతి మరక లేకుండా మోదీ సర్కార్ పాలన కొనసాగిస్తుందన్నారు. యూపీఏ హయంలో కుంభకోణాలతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందన్నారు. 

బొగ్గు గనుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని 2015లో కోల్ మైనింగ్ చట్టం ప్రవేశపెడితే.. కేసీఆర్ కుటుంబం నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించిందని చెప్పారు. ఆ చట్టంలో భాగంగానే ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గుజరాత్‌కో న్యాయం, తెలంగాణాకో న్యాయం అని టీఆర్ఎస్ నేతలు  చెప్పడం.. ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios