హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తొందరపాటు చర్యలు తీసుకొన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం ఓ మెట్టు దిగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రజలకు సేవ చేసే ఆర్టీసీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల జీవితాల గురించి కూడ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ఈ నెల 5వ తేదీలోపుగా విధుల్లో చేరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టారు.

ఇప్పటికే 5100 రూట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ కార్మికులు విదుల్లో చేరకపోతే మిగిలిన రూట్లను కూడ ప్రైవేట్ పరం చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Also Read:కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై

మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడ సమ్మె విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు. సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించడంతో కొందరు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. సిద్దిపేట, కామారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట డిపోల్లో ఆర్టీసీ కార్మికులు  విధుల్లో చేరారు.ఈ మేరకు ఆయా డిపో మేనేజర్లకు ఆర్టీసీ కార్మికులు తాము విధుల్లో చేరుతామని ఆర్టీసీ కార్మికులు లేఖలు ఇచ్చారు. 

రెండు మాసాలుగా జీతాలు లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు.