Asianet News TeluguAsianet News Telugu

కల్వకుంట్ల కుటుంబం వల్ల తెలంగాణ పరువు పోతుంది.. అలాంటి ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకు?: కిషన్ రెడ్డి

కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువు, గౌరవం పోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నవ్వులపాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Union Minister Kishan Reddy Slams KCR government
Author
First Published Jan 25, 2023, 5:48 PM IST

కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువు, గౌరవం పోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నవ్వులపాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసమే కల్వకుంట్ల కుటుంబం తపిస్తోందని మండిపడ్డారు. బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌వి దుర్మార్గపు ఆలోచనలు అని మండిపడ్డారు. కేసీఆర్ నిజాం కాలం నాటి ఆలోచనలతో పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని, గవర్నర్ వస్తే కనీసం గౌరవం చూపడం లేదని మండిపడ్డారు. దేశానికో విధానం, తెలంగాణకు ఓ విధానం ఉండదన్నారు.  తెలంగాణ సర్కార్ తీరును ఖండిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాలు కొన్ని కనీస గౌరవ, మర్యాదలను పాటించాల్సి ఉందన్నారు. 

తెలంగాణ  సర్కార్‌ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదని అన్నారు. తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోనని కేసీఆర్ ఈ విధమైన వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన విధానాలతో తెలంగాణ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందరు సీఎంలకు ఉండే విధానమే.. కేసీఆర్‌కు కూడా ఉంటుందన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా కనీసం  రాష్ట్రం నుంచి శకటానికి సంబంధించిన ప్రపోజల్ కూడా పంపలేదని అన్నారు. 

సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. ధర్నాలు, పాదయాత్రలు చేయాలంటే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పర్యటనలు ఉంటే ముందస్తు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్‌ నివేదిక పంపుతారని అన్నారు. మూడు నెలలు అయితే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios