ఉన్న గద్దె ఊడిపోయే పరిస్థితి నీదీ, ఢిల్లీలో గద్దె గురించి మర్చిపో: కేసీఆర్ పై కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర యాదాద్రి జిల్లాలో మంగళవారం నాడు ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు..
యాదగిరిగుట్ట: ఉన్న గద్దె ఊడిపోయే పరిస్థితి వచ్చింది, ఢిల్లీ గద్దె గురించి వచ్చే జన్మలో ఆలోచించాలని తెలంగాణ సీఎం KCR పై కేంద్ర మంత్రి Kishan Reddy సెటైర్లు వేశారు. అధికార దుర్వినియోగానికి TRS ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
BJP రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ప్రజ సంగ్రామ యాత్ర మూడో విడత మంగళవారం నాడు యాదాద్రి భువనగరి జిల్లాలో ప్రారంభించారు. యాదాద్రి ఆలయం నుండి భద్రాద్రి ఆలయం వరకు యాత్ర కొనసాగనుంది. 27 రోజుల పాటు 328 కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు బండి సంజయ్.ఈ యాత్ర ప్రారంభ సూచికంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయన్నారు. అధికారులు కూడా చట్టపరంగా, న్యాయపరంగా వ్యవహరించాలన్నారు. అధికారులు అతిగా వ్యవహరించవద్దని కూడా సుతిమెత్తగా హెచ్చరించారు.
ఏడాది తర్వాత రాష్ట్రంలో మార్పు రానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయించడాన్ని కిషన్ రెడ్డి తప్పు బట్టారు.దేశాన్ని ఉద్ధరించడాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రజల సమస్యలపై స్పందించాలని కేసిఆర్ కు హితవు పలికారు కిషన్ రెడ్డి.హుజూరాబాద్ లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడ వచ్చిన ఫలితమే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే రకమైన ఫలితం వస్తుందని కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈడీ గురించి నైతిక హక్కు కేసీఆర్ లేదన్నారు.
Telangana CM కేసీఆర్ అధర్మంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ అహంకారానికి తెలంగాణ రాష్ట్రం బలైపోతుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అబద్దాలకు పెద్ద బిడ్డలన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని పక్కన పెట్టి నాదే రాజ్యం అనే రీతిలో కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్, ఎంఐఎం రాజ్యాంగాన్ని టీఆర్ఎస సర్కార్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు కేసీఆర్ కు పట్టవని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడితే కేసీఆర్ పట్టించుకోని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన తప్ప కేసీఆర్ కు ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై మీకు చిత్తశుద్ది ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి విషయమై మీకు ఇప్పటికైనా చిత్తశుద్ది ఉందా అని ఆయన అడిగారు. దళితబంధును అందరికీ వర్తింపజేస్తారా అని ఆయన ప్రశ్నించారు. . మరో వైపు బీసీ బంధును కూడా అమలు చేస్తారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఉన్న ఉద్యోగాలను తీసీవేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కూడా కేసీఆర్ కారణమన్నారు. ఉచితంగా ఎవరువులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయన్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఏమయ్యాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారన్నారు. తెలంగాణ సాధన కోసం వెయ్యి మందికి పైగా విద్యార్ధులు ఆత్మార్పణం చేసుకున్నారన్నారు. వీరందరి ఆత్మార్పణం నీ కుటుంబం పదువలు పొందేందుకు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వారంతా ప్రగతి భవన్ నుండి ఎందుకు బయటకు వస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు, సచివాలయం లేదని కేంద్ర మంత్రి సెటైర్లు వేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా సెక్రటేరియట్ కు రాలేదన్నారు. నెలలో 20 రోజులు ఫామ్ హౌస్ లో, 10 రోజులు ప్రగతి భవన్ లో ఉంటారన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను కలుస్తారన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజలను కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వరని చెప్పారు.