అంబర్‌పేట్‌లో కిషన్ రెడ్డికి షాక్ .. బీఆర్ఎస్ గూటికి కీలక నేత, ‘టికెట్’పై హామీ ఇవ్వనందుకే..?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకట్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో అంబర్‌పేటలో పెద్ద కుదుపు చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో అంబరుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలని కిషన్ రెడ్డిని వెంకటరెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం అంబర్‌పేటకు చెందిన సీనియర్ నేత, హైదరాబాద్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వెంకట రెడ్డి పార్టీని రాజీనామా చేశారు. తమ నిర్ణయం ప్రకటించిన వెంటనే వెంకట రెడ్డి దంపతులు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. కిషన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా వెంకటరెడ్డి వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో అంబరుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలని కిషన్ రెడ్డిని వెంకటరెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై కిషన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. రోజులు గడుస్తూ వుండటంతో వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
ఇదిలావుండగా.. తెలంగాణ బీజేపీలోని దాదాపు 10 మంది కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ దూకుడుగా వుండటం, ప్రజల్లో వున్న బలం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని బీఆర్ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని వారు భావిస్తున్నారు. అతి త్వరలోనే వీరు హస్తం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.