ఎంఐఎం పరోక్షంగా తెలంగాణను పాలిస్తోంది.. కిషన్ రెడ్డి
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మూడు కుటుంబ ఆధారిత, అవినీతి పార్టీలేనని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మూడు కుటుంబ ఆధారిత, అవినీతి పార్టీలేనని విమర్శలు గుప్పించారు. మూడు పార్టీలు గతంలో కలిసి పనిచేశాయని, భవిష్యత్తులో మళ్లీ అదే పని చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలలో ఒకరికి ఓటు వేస్తే ఇతరులకు వేసినట్లేనని అన్నారు. ఈ మూడు పార్టీలతో బీజేపీ ఎప్పుడూ చేతులు కలపలేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆ పని చేయదని అన్నారు.
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ పోరాటాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మూడు పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్రాన్ని పాలించాయని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ద్వారా తెలంగాణను ఎంఐఎం పరోక్షంగా పాలిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ పట్టుకుని ఎంఐఎం పరోక్షంగా రాష్ట్రాన్ని పాలిస్తుందని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం తెచ్చుకున్నామో.. వాటిని సాకారం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇక, కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని అన్నారు.