హైదరాబాద్‌: కుటుంబపార్టీలు తెలంగాణ న్యాయం చేయలేవంటూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న బిజెపికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు బిజెపి నుండి పోటీచేస్తున్న అభ్యర్ధులకు ఓటేసి గెలిపించాలని పట్టభద్రులను జవదేకర్ కోరారు.  

సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ హోటల్లో ''ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో పట్టభద్రుల పాత్ర'' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం మొత్తం బిజెపిని ఇష్టపడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బిజెపిని ఇష్టపడుతున్నారని దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బయటపడిందని... ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కూడా అదే తీర్పునివ్వనున్నారని అన్నారు. 

read more  అవి పిచ్చి సర్వేలు.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీల్లో ఏమైంది: కేసీఆర్‌కు రాములమ్మ చురకలు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో బిజెపి సిట్టింగ్ అభ్యర్థి రాంచంద్రరావు మళ్లీ పోటీచేస్తున్నారని... ఆయన మళ్లీ ఎమ్మెల్సీగా గెలిస్తే శాసనమండలిలో సమస్యగా మారుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని జవదేకర్ అన్నారు. అందువల్లే ఆయనను ఎలాగయినా ఓడించాలని చూస్తున్నారని... కాబట్టి గ్రాడ్యుయేట్స్ రామచంద్రారావుకు అండగా నిలవాలన్నారు. తమ సమస్యలపై పోరాడుతున్న ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులదేనని జవదేకర్ పేర్కొన్నారు.