తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. కేసీఆర్‌వి పిచ్చి సర్వేలని..  ఆ విషయం దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రుజువైందని ఆమె గుర్తుచేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కబ్జాకోరో, దోపిడీదారో తెలిశాక ప్రజలే నిర్ణయిస్తారని విజయశాంతి ఎద్దేవా చేశారు. సాగర్‌లో గెలుస్తామని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా వుందని ఆమె ధ్వజమెత్తారు. 

మరోవైపు  నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో విజయశాంతి పాత్రపై బీజేపీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఉపఎన్నిక ప్రచారంలో రాములమ్మ కీలకంగా వ్యవరించనున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ నాయకత్వంపై పదునైన విమర్శలు చేయటానికి రాములమ్మ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Also Read:టీఆర్ఎస్ మెడలు వంచాలంటే బీజేపీని గెలిపించాలి: బండి సంజయ్

ఈ మధ్యనే తిరిగి సొంతగూటికి చేరుకున్న విజయశాంతికి ఆ పార్టీ నాయకత్వం స్వేచ్ఛనిచ్చినట్లుగా తెలుస్తోంది. సాగర్ లాంటి చోట విజయశాంతి ప్రచారం నిర్వహిస్తే కలసి వస్తోందని కమలనాథులు భావిస్తున్నారు. 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను సవాల్ చేసే స్థాయికి ఎదుగుతున్న బీజేపీ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ‌సాగర్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్న బీజేపీ.. ఈ విషయంలో ఏ మాత్రం తప్పటడుగులు వేయకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.