హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో అమిత్  షా బీజేపీ అభ్యర్ధుల తరపున రోడ్ షోల్లో పాల్గొంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులో  ప్రత్యేక విమానంలో ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు. 

అమిత్ షాకు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.  బేగంపేట ఎయిర్ పోర్టు నుండి  అమిత్ షా నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు.

నగరంలోని వారాసిగూడ చౌరస్తా నుండి సీతాఫల్ మండి వరకు రోడ్‌షోలలో అమిత్ షా  పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమిత్ షా బీజేపీ కార్యాలయానికి చేరుకొంటారు.  సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.