Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 28న తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వాటిపైనే ఫోకస్..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షిస్తారు.

Union Home Minister Amit Shah to visit Telangana on Jan 28 under BJP's Lok Sabha Pravas campaign
Author
First Published Jan 14, 2023, 9:20 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు. ఇక, అమిత్ షా పర్యటన సందర్భంగా.. బీజేపీ తెలంగాణ కార్యవర్గంతో సమావేశం కానున్నారు. ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహానికి సంబంధించి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్‌‌కు అమిత్ షా తన పర్యటనలో కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

అమిత్ షా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షిస్తారు. అలాగే.. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో క్లస్టర్ సమావేశాలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో అమిత్ షా రెండు క్లస్టర్ సమావేశాలలో పాల్గొంటారని, ఎన్నికల సన్నాహాలను సంస్థాగతంగా పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు కూడా బీజేపీ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 18న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం కానున్నారు. 


ఇక, గత ఏడాది డిసెంబర్ చివరలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారానికి సంబంధించిన 2.0ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios