కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరకున్న అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరకున్న అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అమిత్ షాకు స్వాగతం పలికినవారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేతలు మురళీధర్ రావు, లక్ష్మణ్, విజయశాంతి, వివేక్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపు రావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్.. ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన 2.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరడం ఆలస్యం కావడంతో.. ఇక్కడి ఆలస్యంగా చేరుకున్నారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.
అమిత్ షా ముందుగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు గంటపాటు అమిత్ షా గడపనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడలో బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళతారు.
ఇక, తెలంగాణ పర్యటనకు బయలుదేరే ముందు అమిత్ షా ట్విట్టర్‌లో తెలుగులో పోస్టు చేశారు. తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉందన్నారు. ‘‘హైదరాబాద్‌లోని CFSL క్యాంపస్‌లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించేందుకు నేడు తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నాను’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
