మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలకేంద్రానికి చెందిన చింతకాయల ఉదయ్  ఉచ్చులో మరికొందరు అమ్మాయిలు చిక్కుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సూర్యాపేట పట్టణంలో అక్కా చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉదయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

సూర్యాపేటలో ఒంటరిగా జీవిస్తున్న మహిళకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వయస్సు 17 ఏళ్లు. ఆమెకు మునగాలకు చెందిన చింతకాయల ఉదయ్ తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ పనిచేస్తున్నాడు. ఈ సమయంలోనే సూర్యాపేటకు చెందిన అమ్మాయితో ఉదయ్ కు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడిందని పోలీసులు గుర్తించారు.

ఇటీవల కాలంలో అతను సూర్యాపేట ఆసుపత్రిలో కంపౌండర్ గా విధుల్లో చేరాడు. తనను ప్రేమించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ అమ్మాయిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఆమె అతడి వలలో పడింది.

సూర్యాపేటలోని తన స్నేహితుడి గదికి ఆ బాలికను తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  అంతేకాదు బాధితురాలి నుండి రూ. 2 లక్షలను విడతల వారీగా ఉదయ్ తీసుకొన్నాడు.

సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కు చెందిన మరొక యువకుడికి ఉదయ్ లవర్ సోదరి పరిచయమైంది.  ఈ అమ్మాయిపై ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  అంతేకాదు ఆ అమ్మాయి నుండి రూ. 50 వేలు తీసుకొన్నాడు.

ఈ విషయమై  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఉదయ్ ఇదే తరహాలో పలువురు అమ్మాయిలను మోసం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఉదయ్ ఫోన్ నుండి పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరించారు.