సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొట్టడానికి జలాశయంలో దిగిన ఇద్దరు యువకులు.. నీటిలో మునిగిపోయారు. 

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొట్టడానికి జలాశయంలో దిగిన ఇద్దరు యువకులు.. నీటిలో మునిగిపోయారు. గల్లంతైన ఇద్దరు యువకులను హైదరాబాద్‎కి చెందిన అక్షయ్ వెంకట్(28), రాజన్ శర్మ(28) గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గల్లంతైన యువకులు మృతి చెందినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు మండలం బోజ్యా తండా వద్ద శనివారం సీతారామ ప్రాజెక్టు కెనాల్‌లో పడి ఇద్దరు మృతిచెందారు. శనివారం మధ్యాహ్నం బోజ్య తండా సమీపంలోని కాలువలో పాపకొల్లు గ్రామానికి చెందిన నర్సింహారావు (34), బాబురావు (42) అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనపై వారితో ఉన్నవారు పోలీసులు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు. 

సీతారామ కెనాల్‌లో భారీగా నీరు ఉండటం వల్లే ఈ ప్రమాదంజరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పాపకొల్లు గ్రామంలో విషాదం నింపింది. బాబురావు, నర్సింహారావుల మృతితో వారివారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాబురావుకు భార్య, ఇద్దరు కొడుకులు.. నర్సింహారావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.