హైదరాబాద్:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు  వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలపై టీఆర్ఎస్ కార్యకర్తలపై  దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది.

మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి  2014 లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రసమయి బాలకిషన్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా కూడ ఇదే నియోజకవర్గం నుండి  రసమయి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఆదివారం నాడు రసమయి బాలకిషన్ ఇల్లంతకుంట మండలంలోని నేరేడుపల్లి, వంతడుపుల, కందికట్కూరు గ్రామాల్లో  ప్రచారానికి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు నిరసన సెగ తగిలింది.

నాలుగేళ్లుగా  ఏం చేశావని  రసమయి బాలకిషన్ ను  వంతడుపుల గ్రామస్తులు నిలదీశారు. ముంపు గ్రామమైన తమకు పునరావసం కల్పించడంలో  ఎందుకు మీనమేషాలు లెక్కించావని కంది కట్కూరు గ్రామస్తులు నిలదీశారు. దీంతో  మహిళలపై టీఆర్ఎస్  కార్యకర్తలు దాడికి దిగారు. ఈ విషయం తెలిసిన పోలీసులు  రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప జేశారు.