హైదరాబాద్: సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ ముందు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ఎదురెళ్లి కారు కింద  పడి ఆత్మహత్యాయత్నానికి ఓ యువకుడు పాల్పడ్డాడు.  మరో యువకుడు పెట్రోల్ పోసుకొని  ఆత్మహత్యాయత్నం చేశాడు. 

హరీష్ రావు కాన్వాయ్ లోని కారు కింద పడిన యువకుడు  సురక్షితంగా బయటపడ్డాడు. పేట్ బషీరాబాద్ సీఐ వేధిస్తున్నారని అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది.  బిల్డర్‌తో కుమ్మక్కై తమను సీఐ వేధింపులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియాకు కన్నీరు పెట్టుకొంటూ చెప్పారు. తమ కుటుంబాన్ని బతకనించే పరిస్థితి లేదని  ఆవేదన చెందారు. రౌడీలు తమను బతకనిచ్చే పరిస్థితి లేకుండా పోయిందని వారు చెప్పారు.