ఇద్దరు పదోతరగతి విద్యార్థినుల మిస్సింగ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. ఇద్దరి బ్యాగులు చెరువుగట్టుపై లభించడంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత పెరిగింది. 

హైదరాబాద్: ఇద్దరు బాలికల మిస్సింగ్ (school girls missing) హైదరాబాద్ (hyderabad) లో కలకలం రేపుతోంది. శనివారం ఉదయం స్కూల్ కు వెళుతున్నామని ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఇద్దరు బాలికలు కనిపించకుండా పోగా ఇప్పటివరకు వారి ఆఛూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

జీడిమెడ్ల పరిధిలోని సూరారం కాలనీకి చెందిన మౌనిక, గాయత్రి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం ఉదయం స్కూల్ కి వెళ్లి సాయంత్రమైనా తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు స్కూల్ తో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలికల ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలోనే విద్యార్థునులిద్దరి స్కూల్ బ్యాగ్స్ సూరారం చెరువుగట్టుపై లభించాయి. కానీ అక్కడెక్కడా బాలికలు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత పెరగడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కూడా బాలికల కోసం గాలింపు ప్రారంభించారు.

బాలికలు బ్యాగులను చెరువుగట్టుపై విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లారా లేక ఏదయినా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగానే పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు కనిపించకపోయిన తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు వెతుకులాట కొనసాగుతోంది. వారి ఆచూకీ కోసం ఇంకా బంధువులు, స్నేహితులను ఆరా తీస్తున్నారు.