తెలుగు సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కొంగర అంజమ్మ, నాగం ఉమా శంకర్‌లుగా గుర్తించారు.
తెలుగు సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కొంగర అంజమ్మ, నాగం ఉమా శంకర్‌లుగా గుర్తించారు. మరికొందరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులు దాదాపు 25 మందిని మోసం చేసి.. రూ. 6 కోట్లు వసూలు చేసినట్టుగా గుర్తించారు. బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆర్ఆర్‌ఆర్, అలవైకుంఠపురం, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో పెట్టుబడులు అని చెప్పి నిందితులు వసూళ్లకు పాల్పడ్డారు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని అంజమ్మ, ఉమా శంకర్ లు నమ్మించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేసి మోసగాళ్లు డబ్బులు వసూలు చేశారు.
దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. నాగం ఉమాశంకర్, కొంగర అంజమ్మ, ఆమె కొడుకు కొంగర సుమంత్, కూతురు హేమపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ప్రధాన సూత్రధారులైన కొంగర అంజమ్మ, నాగం ఉమా శంకర్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొంగర సుమంత్, హేమలను పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అంజమ్మ, ఉమా శంకర్ బాధితులు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది.
