ములుగు జిల్లాలో ఈతకు దిగి గోదావరిలో నలుగురు యువకులు గల్లంతైన ఘటనలో ఆదివారం మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని వెంకటాపురం మండలం రంగరాజపురం కాలనీకి చెందిన తుమ్మ కార్తిక్(21), అన్వేష్(23), శ్రీకాంత్(21), రాయవరపు ప్రకాష్(23) పాత మరిశాల వద్ద శనివారం బర్త్ డే వేడుకల కోసం వెళ్లారు.

అనంతరం దగ్గరలోని గోదావరిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో వెతకారు.

ఈ క్రమంలో రాయవరపు ప్రకాశ్‌, తుమ్మ కార్తీక్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటికే చీకటి కావడంతో మరో ఇద్దరి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం మరోసారి గాలింపు చేపట్టిన పోలీసులు అన్వేష్, శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు.

వెంటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.