నాగర్ కర్నూల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో ఇద్దరు పశువుల కాపర్లు కొట్టుకుపోయిన విషాదం నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పశువులను నీరు తాగించేందుకు వాగు వద్దకు వెళ్లిన కాపర్లిద్దరు ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయారు. 

ఈ ప్రమాదం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్నకారుపాముల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్చిరెడ్డి(55), నరేందర్ రెడ్డి(22) పశువులను మేపడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పశువులను నీరు తాపడానికి వాగు వద్దకు వెళ్లారు. ఇలా పశువులు నీరు తాగుతుంటే ఒడ్డును నిల్చున్న బిచ్చిరెడ్డి కాలుజారి నీటిలో పడిపోయాడు. 

నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతన్ని కాపాడేక్రమంలో నరేందర్ కూడా ప్రమాదానికి గురయ్యాడు. వీరిద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గజఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.