రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నందిగామ మండల పరిధిలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  నందిగామ మండల పరిధిలోని ఎంఎస్ఎన్ పరిశ్రమ ముందు 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని అతివేగంగా వెనకాల నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చి లారీ ని ఢీకొట్టడంతో... బస్సులోని ప్రయాణికులు ఇద్దరు.. బస్సు కిటికీల్లో నుంచి బయటకు పడి తీవ్రగాయాలపాలై కన్నుమూశారు. ఇతర ప్రయాణికులు తీవ్రగాయాలపాలయ్యారు.

మృతులు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంకట సుబ్బయ్య(66), కర్నూలు జిల్లా వెలుగోడుకు చెందిన హైమద్(24)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సైతం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.