తెల్లవారుజామున తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ శివారులో పాలవ్యాన్ బీభత్సం సృష్టించింది. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో జనాలపైకి దూసుకెళ్ళడంతో ఇద్దరణం చెందారు.
హైదరాబాద్: తెల్లవారుజామున నగరవాసులకు పాలను సప్లై చేసే వాహనం నానా భీభత్సం సృష్టించింది. పాలక్యాన్లతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపక్కన జనాలపైకి దూసుకెళ్లిన దుర్ఘటన హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పాలవ్యాన్ రోడ్డుకిందకు దూసుకువచ్చి అడ్డువచ్చిన వారిపై నుండి దూసుకువెళ్లిందని... చివరకు ఓ దుకాణాన్ని ఢీకొని ఆగిందని స్థానికులు చెబుతున్నారు. దుకాణాన్ని ఢీకొనకుండా ముందుకు వెళ్లివుంటే మరికొన్ని ప్రాణాలు బలయ్యేవని తెలిపారు. ప్రస్తుతం వ్యాన్ డ్రైవర్ పోలీసుల అదుపులో వున్నాడు.
ఇదిలావుంటే నిన్న(సోమవారం) కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన బందగి విజయ్, పాండురంగం, కల్హేర్ మండలం గాంధీనగర్ కు చెందిన సత్యం ఒకే బైక్ పై కామారెడ్డి జిల్లాకు పనిపై వెళ్లారు. ఈ క్రమంలోనే వీరు పిట్లం మండలం గద్దగుండు తండా వద్ద నేషనల్ హైవే 161పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ముగ్గురు హైవేపై వేగంగా వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ డీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ కారణమా... లేక మృతిచెందిన యువకులే కారణమా అన్నది తెలియాల్సి వుంది.
ఇక గత ఆదివారం కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడుపుతూ రాంగ్ రూట్ లో వచ్చి ముగ్గురిని బలితీసుకున్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ద దంపతులతో పాటు కారు డ్రైవర్ మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం శివారులో రాజీవ్ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది.
కరీంనగర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకులు తాండ్ర పాపారావు(62), ఆయన భార్య పద్మ(56) ఓ అద్దెకారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అదే జిల్లాలోని నాగుల మల్యాలకు చెందిన గొంటి ఆంజనేయులు(48) నడుపుతున్నారు. మల్లారం శివారులోకి రాగానే ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న లారీ ముందు నుంచి కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
