నల్గొండ జిల్లా ఇనుపాముల వద్ద రోడ్డు ప్రమాదం: కారు దగ్దం, ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు దగ్ధమైంది. కారులో ప్రయాణీస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద శుక్రవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు. హైద్రాబాద్ నుండి కారులో సూర్యాపేటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఫణికుమార్ తన కుటుంబ సభ్యులతో కారులో హైద్రాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫణికుమార్ కుటుంబం సూర్యాపేటలోని విద్యానగర్ లో నివాసం ఉంటుంది. ఇనుపాముల వద్ద కారు డివైడర్ ను ఢీకొని రోడ్డుపై బోల్తా కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వెనుక నుండి వస్తున్న వాహనదారులు ఈ విషయాన్ని గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫణికుమార్ అతని తల్లి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఫణికుమార్ భార్య , పిల్లలు కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు అతి వేగం ప్రధానంగా ప్రమాదాలకు కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. 50 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కనే లోయలో బోల్తాకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు మృతి చెందారు.
ఈ నెల 12న నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరీక్షలు రాసేందుకు వెళ్తున్న నర్సింగ్ విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్ధినులు తీవ్రంగా గాయపడ్డారు. తాటికల్ ఫ్లైఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ నెల 8వ తేదీన ఈ ప్రమాదం జరిగింది.కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సవలంగ రోడ్డులోని కల్లాపుర వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి చెందారు.ఈ ఘటన ఈ నెల 11న జరిగింది.