సోమవారం సంగారెడ్డి.. నారాయణఖేడ్ లో నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభకు ముందు విషాదం చోటు చేసుకుంది. సభకు బస్సులో తరలి వస్తున్న వారిలో ఇద్దరు గుండెపోటుతో మరణించారు.

నారాయణఖేడ్ : Narayankhedలో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి KCR బహిరంగ సభలో విషాదం చోటు చేసుకుంది. సభలో పాల్గొనేందుకు బస్సులో వస్తూ ఇద్దరు heart attackతో మృతి చెందారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ ఎల్లంపల్లికి చెందిన లింగమయ్య (37) మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. సీఎం సభ కోసం పంపిన బస్సుల్లో గ్రామ తెరాస నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణఖేడ్ వస్తుండగా.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి వద్ద గుండెపోటుతో బస్సులోనే మృతిచెందాడు. 

రేగోడు మండలం పెద్ద తండాకు చెందిన వారు మరో బస్సులో వస్తుండగా.. నారాయణ్ ఖేడ్ సమీపంలోకి రాగానే అందులోని శాంతాబాయి (45) అనే మహిళ గుండెపోటుతో బస్సులోనే కుప్పకూలింది. నారాయణఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇదిలా ఉండగా, సోమవారం సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయణ ఖేడ్ పట్టణ శివారులో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఉణ్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. వృద్ధులకు పెన్షన్ తో వారి గౌరవం పెరిగిందని చెప్పారు. దేశంలో రైతు బంధు పథకం ఎక్కడా లేదన్నారు. నారాయణ్‌ఖేడ్‌కే ఎక్కువగా రైతు బంధు నిధులొస్తున్నాయని తెలిపారు. 

‘తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశాం. ఉదృతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని చెప్పారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని అన్నారు. తెలంగాణలో అంధకారం అలుముకుంటుందన్నారు. అప్పుడు విమర్శలు చేసిన చోటనే ఇప్పుడు అంధకారం ఉందన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. ఏడేళ్లలోనే తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు దేశంలో నెం.1 గా తెలంగాణ ఉంది.

తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాలకు నీరందాలి. ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలి. గజ్వేల్ కంటే ఎక్కువగా ఆందోల్‌కు ఎక్కువ నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌లోని 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశాం. మరోసారి సంగమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తాను’ అని కేసీఆర్ తెలిపారు. 

అంతేకాదు తెలంగాణను బాగు చేసినట్లే దేశ రాజకీయాల్లో పోరాడదామని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ దాకావెళ్లి కొట్లడదామని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారత దేశం తయారు చేసుకుందామని అన్న కేసీఆర్.. అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే పనికిమాలిన దందా కొనసాగుతుందని.. దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిద్దామని తెలిపారు. భారత్‌ను అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసేలా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు మన దేశంలోని విద్యార్థులు అమెరికా వెళ్తున్నారని.. కానీ విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చేలా అభివృద్ది చేయాలన్నారు. జాతీయ రాజకీయాల్లో వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు.