ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.  కేవలం తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ యువకులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ సంఘటన నిజాబాద్ జిల్లాలోని పెద్ద పన్నూర్ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బైక్ ని ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో బేగంపేట గ్రామానికి చెందిన దేవునూరి అజయ్‌(28), పోతరవేని రాకేశ్‌(24) అక్కడికక్కడే చనిపోయారు. 

మరో ఘటనలో నిజామాబాద్‌ జిల్లా మల్లారం గండి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక బస్సు పూర్తిగా రోడ్డుకిందికి వెళ్లిపోయింది. బస్సులో తొక్కిసలాట జరిగి వృద్ధులు, పిల్లలకు గాయాలయ్యాయి.

మరో ఘటనలో  వికారాబాద్‌ జిల్లా అనంతగిరి ఘాట్‌ రోడ్డులో తాత్కాలిక డ్రైవర్‌ నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దూకి.. టైర్లకు అడ్డుగా రాళ్లు వేసి ఆపారు. 

మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా బసంత్‌గనర్‌ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు కనుకమ్మ అనే వృద్ధురాలి కాలుపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు కార్లను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా, హన్మకొండ బస్టాండులో గురువారం పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల్లో తాత్కాలిక డ్రైవర్‌ నర్సయ్య అడ్డంగా దొరికిపోయాడు. కండక్టర్‌ ఫిర్యాదు మేరకు అధికారులు అతడికి పరీక్షలు నిర్వహించగా మద్యం తీసుకొన్నట్లు తేలింది.