కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా ముజాహిద్ నగర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ముజాహిద్ నగర్ కు చెందిన సయ్యద్ రియాజ్(10), మహ్మద్ బద్రుదీన్(5) అనే ఇద్దరు చిన్నారులు మంగళవారం మధ్యాహ్నం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు.

ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో... తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల మొత్తం గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  అయినప్పటికీ... ఇంటి చుట్టుపక్కల గాలించారు. కాగా... అర్థరాత్రి సమయంలో ఇంటికి సమీపంలోని ఓ కారులో చిన్నారులు ఇద్దరూ శవాలుగా మారి కనిపించారు.

కారు ఓనర్ డోర్ తీయగా.. అర్థరాత్రి 2గంటల సమయంలో పిల్లలు చనిపోయి కనిపించారు. వెంటనే ఆ కారు యజమాని చిన్నారుల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతిచెందిన చిన్నారులు ఇద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు. ఈ ఘటనపై చిన్నారులకు కుటుంబసభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని... ఎవరో పథకం ప్రకారం హత్య చేశారని వారు అనుమానిస్తున్నారు.