హైదరాబాద్: వ్యాపారంలో నష్టపోయిన దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హనీ ట్రాప్ ను ఎంచుకొన్నారు. పలువురిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.. అయితే  ఈ జంట వలలో చిక్కుకొన్న మత ప్రచారకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో హానిట్రాప్ చేసిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో ఓ ప్రార్ధన మందిరానికి ఈ ఏడాది ఆగష్టులో 25 ఏళ్ల మహిళ వచ్చింది.తాను  సికింద్రాబాద్ లో అనాథ ఆశ్రమం నడుపుతున్నట్టు చెప్పింది. మత బోధకుడి ఫోన్ నెంబర్ తీసుకొంది.

అతడితో తరచూ వాట్సాప్ చాటింగ్ చేసేది. రెండు మూడు సార్లు అతడితో బయటకు వెళ్లింది. చిలుకూరు మృగవని పార్క్ కు, మరోసారి శంషాబాద్ రెస్టారెంట్ లో భోజనానికి పిలిచింది.  మూడోసారి వండర్ ల్యాండ్ కు రమ్మని పిలిచింది.

వండల్ ల్యాండ్ లో అతడితో ఆమె సెల్పీలు దిగింది. వీరిద్దరూ ఇలా కలిసి ఉన్న సమయంలో ఆ మహిళకు చెందిన కొందరు వ్యక్తులు వీరిద్దరి ఫోటోలను చాటుగా తీసేవారు.

అయితే తన భర్త విజయవాడలో హోటల్ వ్యాపారం చేస్తున్నాడని మత బోధకుడిని నమ్మించింది. అంతేకాదు హోటల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కూడ ఆమె అతడిని కోరింది.ఆ వగలాడి మాటలను నమ్మిన మత బోధకుడు ఆమె చెప్పినట్టుగా హోటల్ వ్యాపారంలో పెట్టుబడి కోసం రూ. 10 లక్షలు ఇచ్చాడు.

గతనెలలో హోటల్ వ్యాపారానికి సంబంధించిన చర్చల కోసం శంకర్ పల్లిలోని ఓ రిసార్ట్ కు రప్పించింది. అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు అతడిని ఓ గదిలో ఉంచారు.

అదే రోజు రాత్రి పూట వగలాడి అతడి రూమ్ కు వచ్చింది. అతడికి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చింది. ఈ కూల్ డ్రింక్ తాగిన అతను మత్తులోకి జారుకొన్నాడు.

మత్తులో ఉన్న అతడిని బాత్‌రూమ్‌లోని బాత్ టబ్ లో ఉంచారు. మత్తు దిగిన తర్వాత అతను లేచి చూసేసరికి బాత్ రూమ్ లో ఉన్నాడు.అతను మత్తులో ఉన్న సమయంలో అతడితో సాన్నిహిత్యంగా ఉన్నట్టుగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించింది ఆ మహిళ.

మత బోధకుడు బాత్ టబ్‌లో ఉన్న సమయంలోనే ఆ మహిళ భర్త అక్కడికి చేరుకొన్నాడు. ఒకే గదిలో తన భార్యతో పాటు మత ప్రచారకుడు ఉండడాన్ని చూసిన అతను వారిద్దరిని కొట్టాడు.

తుపాకీ చూపి మత ప్రచారకుడిని బెదిరిస్తానని హెచ్చరించాడు. అయితే మత ప్రచారకుడు వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. దీంతో కోటి రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 

ఈ మేరకు వీరిద్దరి మధ్య కోటి రూపాయాలకు డీల్ కుదిరింది. అంతేకాదు ఒప్పంద పత్రాన్ని కూడ రాసుకొన్నారు. ఆ తర్వాత మత ప్రచారకుడిని వదిలిపెట్టారు.

మరునాడే రూ.10 లక్షలను మత ప్రచారరకుడు వారికి ఇచ్చాడు. అంతేకాదు పదే పదే డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో ఆ మత ప్రచారకుడు చేసేదీ లేక పోలీసులను ఆశ్రయించారు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన ఆ మహిళ హనీట్రాప్ ను ఎంచుకొంది.

ఈ మహిళ భర్త హోటల్ వ్యాపారం నిర్వహించేవాడు.ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది. హైద్రాబాద్ లో నిర్వహించిన హోటల్ వ్యాపారంలో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఈ జంట హనీట్రాప్ ను ఎంచుకొన్నారు.

తనకు గతంలో పరిచయం ఉన్న ఎన్ఆర్ఐ ను కూడ ఇదే విధంగా హనీట్రాప్ చేసేందుకు ఆ మహిళ పన్నాగం పన్నింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది.ఎన్ఆర్ఐతో ఆ మహిళ చేసిన చాటింగ్ ను పోలీసులు దర్యాప్తు సందర్భంగా గుర్తించారు. మత ప్రచారకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ జంటను అరెస్ట్ చేశారు.